‘శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం
రామనామ వరాననే’
అంటూ రామనామ వైభవాన్ని ఆ పరమేశ్వరుడు చెప్పాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. పురాతన హిందూ కాలమానం ప్రకారం చైత్ర శుద్ధ నవమినాడు శ్రీరాముడి వివాహం జరిగిందనీ, ఆ రోజే ఆయన పట్టాభిషేకం జరిగిందని పలు గ్రంథాలు పేర్కొంటున్నాయి. అలాగే, శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. చిత్ర శుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చిందని కూడా పురాతన గ్రంథాలు చెబుతున్నాయి.
మానవ రూపంలో ఆ భగవంతుడు వెలసిన ఈరోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే, ఈ రోజు సీతారాముల కళ్యాణం సైతం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే శ్రీరామ నవమిని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య.. మాట తప్పని వైనం, మడమ తిప్పని శౌర్యం.. ప్రతి మనిషిలోనూ ఉండాల్సిన లక్షణాలు. వీటన్నింటీ ప్రతిరూపమే పరమపావన మూర్తి శీరామచంద్రమూర్తి.
పురాణాల ప్రకారం రాముడు త్రేతాయుగానికి చెందినవారు. దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం ఆయన జననం జరిగిందని కొంతమంది చెబుతారు. ఆ సమయంలో సూర్యుడు అత్యంత ప్రకాశంవతంగా కనిపించడాని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ రాముడు తన తండ్రి మాటను జవదాటేవాడే కాదు. పితృవాక్యపరిపాలకుడు. తండ్రిచ్చిన మాటకు కట్టుబడి సతీమేతంగా, సోదరుడి లక్ష్మణుడితో కలిసి 14 ఏండ్లు వనవాసానికి సైతం వెళ్లాడు.
ఇక శ్రీరామ నవమిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. దేవాలయాలతో పాటు వాడవాడల శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రామాలయాలు చాలానే ఉన్నాయి. అయితే, భద్రాచలంలోని రాములవారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. అయితే, గతేడాది నుంచి కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే కేవలం పూజారుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు, రాములోరి కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడు కూడా అదే విధంగా నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.