దర్వాజ – హైదరాబాద్
Team India : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు మ్యాచ్ కు భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీని వహిప్తే తర్వాతి మ్యాచ్ లకు కూడా అతన్నే కొనసాగించాలని టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నారు. తిరిగి మళ్లీ రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేశారు.
న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో భారత్ ఘోరంగా వైట్ వాష్ అయింది. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత ప్లేయర్లు త్వరలోనే ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చు. వ్యక్తిగత కారణాలతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్ కు రోహిత్ దూరం కానున్నాడు. అంతకుముందు రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ తాను ఆడతానో లేదో తనకు తెలియదని చెప్పాడు. అదే జరిగితే తొలి టెస్టులో టీమిండియాకు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు.

“బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు మ్యాచ్ ఆడటం కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా ముఖ్యం. ఇక్కడ రోహిత్ గాయపడటం లేదు. ఇతర కారణాల వల్ల అతడు లేకపోతే వైస్ కెప్టెన్ సహజంగానే ఒత్తిడికి గురవుతాడు. ఆ తర్వాత రోహిత్ తిరిగి వచ్చినా కెప్టెన్సీ అప్పగించాల్సిన అవసరం లేదు. కెప్టెన్ కాకుండా రోహిత్ ను టెస్టు క్రికెట్ ఆడనివ్వండి’ అని సునీల్ గవాస్కర్ అన్నారు.
అలాగే, భారత్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులువు కాదని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. “టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియాను 4-0తో ఓడించడం అంత సులువు కాదు. అది సాధ్యమని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచేందుకు ప్రయత్నించాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ గురించి ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. సిరీస్ ఎలా ముగిసినా ఆడుతూ గెలవడమే కీలకం’ అని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు.