నేనూ రైతు బిడ్డనే..నేనూ కాపోన్నే.. నేను కూడా వ్యవసాయం చేస్త.. : సీఎం కేసీఆర్

ద‌ర్వాజ‌-భువనగిరి

Telangana Assembly Elections 2023: ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై వ్యాఖ్య‌లు చేశారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ తీసేస్తామ‌ని కాంగ్రెస్ చెబుతున్న‌ద‌నీ, ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా అన్ని విష‌యాలు గమ‌నించి స‌రైన నిర్ణయం తీసుకోవాల‌ని అన్నారు. “ఇవ్వాల పదిహేను, ఇరవై నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం. మునుపటి పరిస్థితే వస్తే చాలా ప్రమాదం వస్తది. ఇవ్వాల అనేక రంగాల్లో తెలంగాణ బాగుపడ్డదని” కేసీఆర్ అన్నారు.

అలాగే, ఒకప్పుడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు.. అనేక కష్టాలు ఉండె కానీ నేడు అన్ని ప‌రిస్థితులు మారిపోయాయ‌ని చెప్పారు. “ఇవ్వాల 24 గంటల కరెంటు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ నాయకులు 24 గంటల కరెంటు ఎందుకు? మూడు గంటలు చాలు అంటున్నారు. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే.. ఖచ్ఛితంగా మల్ల ధరణి పోతది.. మల్ల పైరవీకారుల మందలు వస్తయి. వకీళ్లు, కోర్టుల చుట్టూ తిరగాలె. కేసుల పాలు కావాలె.. కరెంటు మాయమైతది. దళిత బంధు ఆగమైతది. అన్నీ కూడా పోయి మల్ల దళారుల రాజ్యమే వస్తది. అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్ని ప్రార్ధిస్తావున్నాన‌ని” కేసీఆర్ పేర్కొన్నారు.

భువనగిరి నియోజకవర్గం అద్భుతమైన నియోజకవర్గమ‌నీ, హైదరాబాద్ కు సమీపంలో ఉంద‌ని పేర్కొన్న కేసీఆర్.. భువనగిరిని ఐటీ హబ్ చేసి, ఐటీ పరిశ్రమలు రావాలని, ఖచ్ఛితంగా తీసుకరావాలని మంత్రి కేటీఆర్ కు చెప్పాన‌ని వివ‌రించారు. ఎన్నికల తర్వాత భువనగిరికి స్పెషల్ ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెట్టించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. బ్రహ్మాండంగా మన పిల్లలకు ఉద్యోగాలు దొరికే ఆస్కారం ఉంటదని చెప్పారు. 50 వేల ఓట్ల మెజార్టీతో పైళ్ల శేఖర్ రెడ్డి గెలవబోతున్నాడ‌నీ, దయచేసి బీఆర్ఎస్ ను గెలిపించండి.. శేఖర్ రెడ్డిని దీవించండని ప్ర‌జ‌ల‌ను కోరారు. మనకు కులం, మతం, జాతి లేదు. ఎన్నికల ప్రణాళికలో అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించామ‌ని చెప్పారు.

మహిళలకు సాధికారికత తెచ్చామ‌నీ, 93 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు కేసీఆర్ బీమా వస్తదనీ, అందరికీ సన్నబియ్యమే వస్తది..ఇది నా మాటగా హామీనిస్తావున్నాన‌ని చెప్పారు. యాదాద్రి నర్సింహాస్వామి దేవాలయాన్ని అద్భుతంగా చేసుకున్నామ‌నీ, భవిష్యత్తులో ఈ జిల్లా ఒక బంగారు తున్కలాగా తయారయ్యే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ రాకముందు అనేక మంది సన్నాసులు అవాకులు, చెవాకులు పేలినార‌నీ, తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతయని బెదిరించారు.. కానీ ఇవ్వాల భూముల ధరలు ఎట్లా ఉన్నయో మీ అందరికీ తెలుసున‌ని అన్నారు. యాదగిరి గుట్ట దగ్గర పొద్దున ఒకరేటు, మధ్యాహ్నాం ఒకరేటు, సాయంత్రం ఒకరేటులో ఇవ్వాల కోట్ల రూపాయలే ఉంది తప్ప లక్షల రూపాయలు లేదన్నారు.

భూమిలేని నిరుపేదలకు కూడా న్యాయం జరగాలని బీమా, సన్నబియ్యం, సౌభాగ్యలక్ష్మి, గృహ నిర్మాణాలను ప్రకటించానని కేసీఆర్ చెప్పారు. “మీ ఆశీస్సులతో మళ్లీ గెలిపిస్తే మీసేవలో భువనగిరిని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తాం. పైళ్ల శేఖర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాన‌ని” చెప్పారు.

Related Post