దర్వాజ-యాదిలో
వెయ్యిరా వెయ్
దెబ్బకు దెబ్బ తీయ్
అంటూ ముదుసలి పలికిన మాటలు
జనపదమై జానపదమై పోరు సలిపేను
విమోచన పోరాటమై…
కత్తులు కోసిన కంఠాలెన్నో
చురకత్తులు దిగిన కాయాలెన్నో
తుపాకి చేసిన గాయాలెన్నో
రజాకారులు చేసిన హత్యలెన్నో
ఊట బావుల్లో వేసిన శవాలెన్నో
శవాల గుట్టలు కావవి
విమోచన కోసం పోరాడిన సమిధలవి.
నిజాం రాజు తరతరాల బూజు
దక్కను ప్రజల కష్టాల పోడు
ఈ నేల తల్లికి పట్టిన చీడ
తరిమేల సాయుధ పోరు.
నిజాం వొక వైపు
గడీల పాలనొక వైపు
వేషభాషలన్నీ మౌడ్యమే
బలవంతపు బతుకులే.
శిస్తులు కట్టక పోతే
మానం పేణం కరుసే
ఖాసిం రిజ్వీ కసాయే
అమాయక గొంతులు కోసే.
రక్త మోడిన నేలన
తెగిపడిన గొంతులెన్నో
రాకాసీ మూకల దాష్టిక వికటహాసా విన్యాసలెన్నో
నిజాం బొక్కసాలు నింపుతుండో…
షేర్వాణి పైజామా
రుమా టోపి
సాంప్రదాయ పేరిట అధికార
అహంకార జులుం
మతోన్మాద చీకటి రాజ్యం
అదో బలవంతపు ఫర్మానా
కాదంటే తప్పదు జరిమానా.
సంకెళ్లు మోసినెందరో
కట్టుబానిస బతుకుల్లో
జీవచ్ఛవ జనులందరూ
అటు చావలేక ఇటు బతకలేక…
సాయుధ పోరాటం మొదలాయే
అగ్నిశిఖలు రాజిల్లే
తరాలు బూజును
తరిమేందుకు పోరు సాగే.
మా భూమి మాదంటూ
మా నేల మాదంటూ
బిగించిన పిడికిలి
గ్రామాల్లో జనం కదిలి.
ఎరుపెక్కిన తెలంగాణా
నిజాం సైన్యం పెచ్చరిల్లే
కర్కశులు జేసే హత్యాకాండలు
వీరుల ప్రాణార్పణలు.
అక్రమ నిర్బంధాల గడీలు
ఆపలేని ప్రజా పక్షపు పోరు
రైతులెందరో కవులెందరో
స్వాతంత్ర కాంక్షకులు ఎందరో…
నాడు దాస్య శృంఖాళాలు వీడిన భారతం
ప్రజా వాణి నినదించిన రోజులవి
నిజాం పాలన తరలి పోవాలని కోరుతున్న ప్రజానీకం.
దేశ సైన్యం దక్కను చేరుతున్న వేళ
నిజాం సైన్యం పారిపోయే
దక్కను ప్రాంతం దేశ కమతామయే…
నిజాం పాలనలో
ఆగమైన బతుకులు
భరతమాత ఒడిలో
స్వేచ్చా గాలులు.
తరాలు బూజు
వదిలిన రోజు
తెలంగాణ విమోచన దినమాయే…

అశోక్ చక్రవర్తి నీలకంఠం,
బడంగపేట, హైదరాబాద్.
మెయిల్: ashokprudvi@gmail.com
డిప్రెషన్ ను తగ్గించే చిట్కాలివిగో..
సైదాబాద్ ఘటన రాజు మరణంపై అనుమానలొద్దు: డీజీపీ మహేందర్ రెడ్డి
సింగరేణి కాలనీ ఘటన నిందితుడు ఆత్మహత్య
మోడీ పుట్టిన రోజునే ‘నిరుద్యోగ దినోత్సవం’
గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక క్రైమ్ రేటు
తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు