Breaking
Sat. Jun 28th, 2025

సుక్క కోసం మందుబాబుల తిప్పలు !

Telangana Lockdown_Liquor Shops See Mad Rush
Telangana Lockdown_Liquor Shops See Mad Rush

దర్వాజ.కామ్ || Darvaaja.com

అరేయ్ ఏడున్నరు రా.. జబ్బున నడువుండ్రిరా.. నాకంతా గాయి గాయి అయితుంది.. గిట్ల చెప్పాపెట్టకుండా జేసింనందుకు.. ఉరుకుండ్రిరా.. అది మన చెయ్యి జారిపోక ముందే గది మనచేతుల జిక్కంచుకోవాలి.. నేను గీ సందులపోతి ఉరుకుతా.. మీరు గూడా వేరే తొవ్వల గుండా వేరే దగ్గరకు ఉరుకుండ్రి. నువ్వు నీ దోస్తుగాళ్లందరూ.. ఎంత దొరికితే అంత.. ఉత్తి శేతులతో మాత్రం ఇంటికి రావొద్దు బిడ్డా.. ఈ దినమంతా మీకు తిండి తిప్పలు లేకున్నా సరే గానీ అది లేకుండా మాత్రం ఇంటికి రావొద్దు.. ఈ ఉరుకులాటంతా దేనికోసమో ఎరుకనా.. అదేదో జెరమొచ్చిందని మందుబిల్లలకోసమో.. మరేదానికోసమో కాదండోయ్.. కిక్కెక్కించే మందు సుక్క కోసమే ఈ ఆరాటమంతా..

అంతా ఇంతా కాదు పాపం.. ఆళ్ల తిప్పలు సూస్తుంటే అయ్యో అన్నా.. నీకొచ్చిన కష్టం పక్కోనికి కూడా రాకూడదు కదే అని జాలి అనిపిస్తుంది మల్లా. ఎర్రటెండను కూడా లెక్క జేస్తలేరు. అంతకు మించి కరోనా నన్ను అంటుకుంటదని బుగులు పడుతలేరు మరి. గిట్ల గాబర ఎందుకైతుర్రో తెలుసునా.. రేపటి నుంచి లాక్ డౌన్ అనే ముచ్చట చెవుల పడ్డదో లేదో.. అప్పుడే పరుగుందుకుని వైన్స్ ల ప్రత్యక్షయ్యిర్రు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రాసుకుంటూ పూసుకుంటూ కిలోమీటర్ల మేరా వైన్సుల ముందు బారులు తీరిండ్రు . ఈ బారులు సూస్తుంటే మాత్రం కరోనా వాక్సిన్ కోసం కూడా ఇంత తిప్పలు పడి ఎండకూడా నాకరాకుట్ట నిలవడ్డరంటే.. మందుబాబులకు సుక్క ఆకలి మామూలుగా లేదనిపిస్తుంది సుమీ..

Telangana-Lockdown_Liquor-Shops-See-Mad-Rush1 సుక్క కోసం మందుబాబుల తిప్పలు !

ఇదే కదా డెడికేషన్ అంటే.. ఇదే కదా ఇష్టమంటే.. ఇదే కదా బాద్యతంటే.. ఇది కదే పట్టుదలంటే.. ఇదే కదా లక్ష్యం అంటే.. ఇదే కదా అనుకున్నది సాధించినప్పుడు వచ్చే ఆనందమంటే.. ఆకలితో కడుపు నకనకలాడుతుంటే బుక్కెడుబువ్వ దొరికితే ఎంత ఆనందమైతదో..ఇది దొరికితే కాడా ఈ అన్నలకు అంతే ఆనందమైతుంది.. కాదు కాదు అంతకు మించి ఆనంద బాష్పాలు వచ్చేంతగా ఆనందమైతుంది పాపం.. ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి.. మాకు పదవులుంటే చాలు అనుకునే నాయకులకు కండ్లను తెరిపియ్యనీకె అత్యున్నత న్యాయస్థానం చాలా అవకాశాలే ఇచ్చింది.. మీరు భూమ్మీదుంటున్నరా.. లేక ఆకాశంలో ఉంటున్నరా.. కష్టకాలంలో ఉన్న జనాలను ఆసరాగా నిలవాల్సిన మీకు ఎన్నికలు కావాల్సి వచ్చాయా అని చురక అంటించింది..

అబ్బే ఎవరనుకుంటే ఏంటీ మా దగ్గర కరోనా కేసులు బాగా తగ్గుతున్నయి.. ఇంకా గాలి బుడ్డిలు కూడా మస్తుగున్నయి.. బెడ్ల కొరత కూడా లేదని.. లేని వసతులను ఉన్నట్టు బాగానే కవర్ చేసింది ప్రభుత్వం. అబద్దాలకు కాలం తక్కువ కదా అందుకే ఏం మాట్లాడుతున్నరు మీరు.. అవన్నీ ఉంటే జనాలెందుకు పిట్టల్లా రాలిపోతున్నరు అని నిలదీసేసరికి నైట్ కర్ఫ్యూ విధించింది. అయినా తగ్గపోగా ఎక్కువవుతుండటంతో న్యాయస్థానం మళ్లీ ఏం చేస్తారో చెప్పండి.. అని నిలదీసేసరికి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంది. మే 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Telangana-Lockdown_Liquor-Shops-See-Mad-Rush-2 సుక్క కోసం మందుబాబుల తిప్పలు !

అయితే నిత్య అవసరాలను తీర్చుకోవడానికి వెసలుబాటుగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ ఉండదని ప్రకటించింది. అంటే 10 గంటల నుంచి లాక్ డౌన్ స్టార్ట్ అవుతుందన్న మాట. లాక్ డౌన్ గురించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందని ఆత్రుతగా ఎదురుచూసిన మందు బాబుల చెవిన ఈ ముచ్చట పడగానే.. వాయమ్మో లాక్ డౌనా.. అని ఒక నిమిషం కండ్లు తిరిగి మరు నిమిషం అలెర్ట్ అయ్యి వైన్సుల ముందు బారులు తీరారు. కనిపించిన కరోనా మహమ్మారి ఒకటుందనే ముచ్చటే మరిచి.. భద్రతను గాలికొదిలేసి.. బార్ల ముందు బారులు తీరారు మందుబాబులు.

లాక్ డౌన్ పెడితే బార్లు మూతపడతాయి అని ముందే ముందు చూపుతో మందుబాటిల్లను అవసరమైనన్ని కొని పెట్టేసుకుంటున్నారు. కొందరైతే.. మళ్లీ ఎప్పుడు మందు దొరకుతుందోనని కాటన్లకు కాటన్లు కొనుక్కుని వెళుతున్నారు. కిలో మీటర్ల మేరా మందుబాబులే కనిపిస్తున్నరు వైన్సుల ముందు. ఈ కరోనా మహమ్మారి మూలంగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు.. కోల్పోతూనే ఉన్నారు.

సెంకడ్ వేవ్ చాలా డేంజర్ అని హెచ్చరిస్తున్నా.. ప్రజల చెవికి ఎక్కడం లేదు. పైగా సుక్క దొరకదనే బెంగతో మాస్కును మూలకేసి.. సోషల్ డిస్టెన్స్ అంటే ఏంటో మరిచి.. మనిషికి మనిషి తోసుకుంటూ మరీ మందు కోసం ఎగబడ్డారు. అయినా వీరికి చెప్పే వారే లేకుండా పోయారు. ప్రజల ప్రాణాలు ఎటుపోతున్నా.. మందు బాబుల మూలంగా అటు ప్రభుత్వం.. ఇటు వైన్సు షాపుల యాజమానులు మాత్రం బాగానే వెనకేసుకుంటున్నారు.

Related Post