Sarath Babu: శరత్ బాబు చివరి సినిమా ‘మళ్లీ పెళ్లి’.. ఫస్ట్ సినిమాతోనే దిగ్గజాలతో స్క్రీన్ షేరింగ్.. !

Actor Sarath Babu

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Actor Sarath Babu: సెప్సిస్, బహుళ అవయవాల వైఫల్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు శరత్ బాబు సోమవారం హైదరాబాద్ లోని ఒక ప్ర‌యివేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయ‌న న‌టించిన చివ‌రి చిత్ర “మళ్లీ పెళ్లి” ఈ నెల 26న విడుద‌ల కానుంది.

1951లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జన్మించిన శరత్ బాబు సినీరంగంలోకి రాకముందు తన పేరును సత్యనారాయణ దీక్షితులుగా మార్చుకున్నారు. శరత్ బాబు తండ్రి హోటల్ వ్యాపారంలో ఉండేవాడనీ, తన కొడుకు కూడా అదే పని చేయాలని కోరుకున్నాడు. అయితే శ‌ర‌త్ బాబు నటుడిగా మారాలని తన దృష్టిని కేంద్రీకరించి తన తల్లి, స్నేహితుల ప్రోత్సాహంతో నట జీవితాన్ని కొనసాగించడానికి మద్రాసు వెళ్ళాడు.

1973లో రామరాజ్యం సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. అవకాశాల కోసం మద్రాసులో ఉండగానే రామవిజయ ప్రొడక్షన్స్ వారు ‘రామరాజ్యం’ అనే సినిమాలో కొత్త హీరోను తీసుకోవాలంటూ చేసిన ప్రకటనను చూసి దాదాపు 3 వేల మంది ఆడిషన్స్ కు వచ్చారు. అయితే దర్శకుడు బాబూరావు ఈ సినిమాలో హీరోగా శ‌ర‌త్ బాబును ఎంపిక చేశారు. జగ్గయ్య, ఎస్వీ రంగారావు, నటి సావిత్రి వంటి ప్రముఖ నటులతో తొలి సినిమాలోనే స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆయన అదృష్టంగా చెప్పుకునే వారు.

ఆ తర్వాత మూడేళ్ల పాటు మరే సినిమాకు సైన్ చేయలేదు కానీ 1976లో రాజా సినిమాలో న్యాయవాది పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. శరత్ బాబు తరువాత తమిళ చిత్రం నిజాల్ నిజామిరదు (1978) ద్వారా మంచి గుర్తింపు పొందారు. దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన పలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. మారో చరిత్ర, గుప్పెడు మనసు, తాయరమ్మ బంగారయ్య, మూడు ముళ్ల బంధం, సీతాకోక చిలుక, సాగర సంగమం, సితార, కాంచన గంగ, స్వాతి ముత్యం, కాష్మోరా, సంసారం ఒక చదరరంగం, అభినందన, స్వాతి చినుకులు, కోకిల వంటి ప్రసిద్ధ చిత్రాలు ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.

నటి రమాప్రభతో శరత్ బాబు 14 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండి 1988లో విడిపోయారు. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని చాలా పుకార్లు వచ్చాయి, అయితే, ఒక ఇంటర్వ్యూలో.. రమాప్రభను వివాహం చేసుకోలేదని, ఆమెతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో మాత్రమే ఉన్నానని చెప్పాడు. ఆ తర్వాత 1990లో స్నేహలత దీక్షిత్ ను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు సంతానం. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించిన ఈ సీనియర్ నటుడు ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో నటించిన ‘మ‌ళ్లీ పెళ్లి’ చిత్రం మే 26న విడుదలకు సిద్ధంగా ఉంది.

Related Post