దర్వాజ – హైదరాబాద్
RCB – Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తిరిగి రాబోతున్నాడు. దీనిపై ఆర్సీబీ యాజమాన్యంతో కోహ్లీ చర్చించినట్లు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ లో 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ.. ఆ జట్టును నాలుగు సార్లు ప్లేఆఫ్స్ కు చేర్చాడు. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఫైనల్లో ఓడిపోయి ఒక్క అడుగు దూరంలో ఐపీఎల్ టైటిల్ ను కోల్పోయాడు.
2021లో టీమిండియా టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కూడా విరాట్ కోహ్లీ వైదొలిగాడు. ఫాఫ్ డుప్లెసిస్ గత మూడేళ్లుగా ఆర్సీబీకి నాయకత్వం వహిస్తున్నాడు, కానీ 40 ఏళ్ల వయస్సులో అతని ఫిట్ నెస్ ఆందోళనల మధ్య అతన్ని ఆర్సీబీ విడుదల చేసే అవకాశముంది. కాగా, ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ రిటైన్ లిస్టు లో చోటుదక్కించుకునే ప్లేయర్ల విషయానికి వస్తే అందులో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, విల్ జాక్స్, యష్ దయాళ్ పేర్లను పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
కాగా, ఈ ఏడాది జూలైలో బీసీసీఐ తన ప్రధాన కార్యాలయంలో 10 ఫ్రాంచైజీల యజమానులతో నిర్మాణాత్మక చర్చల తరువాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సెప్టెంబర్ 28 న బెంగళూరులో సమావేశమై ఐపిఎల్ ప్లేయర్ రెగ్యులేషన్స్ 2025-2027 ను నిర్ణయించింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ కింది నిర్ణయాలు గమనిస్తే.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ ప్రస్తుత జట్టు నుంచి మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇది నిలుపుదల ద్వారా లేదా రైట్ టు మ్యాచ్ (ఆర్టిఎం) ఎంపికను ఉపయోగించడం ద్వారా చేయవచ్చు.
రిటెన్షన్స్, ఆర్టీఎంల కోసం వారి కాంబినేషన్ ను ఎంచుకోవడం ఐపీఎల్ ఫ్రాంచైజీ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. 6 రిటెన్షన్లు/ ఆర్టీఎంలలో గరిష్టంగా 5 క్యాప్డ్ ప్లేయర్లు (ఇండియన్ & ఓవర్సీస్), గరిష్టంగా 2 అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉండవచ్చు. ఐపీఎల్ 2025 కోసం ఫ్రాంచైజీల వేలం పర్సును రూ.120 కోట్లుగా నిర్ణయించారు. మొత్తం వేతన పరిమితిలో ఇప్పుడు వేలం పర్సు, ఇంక్రిమెంటల్ పెర్ఫార్మెన్స్ పే, మ్యాచ్ ఫీజులు ఉంటాయి. ఇంతకుముందు 2024లో మొత్తం వేతన పరిమితి (వేలం పర్స్ + ఇంక్రిమెంటల్ పెర్ఫార్మెన్స్ పే) రూ.110 కోట్లు కాగా, ఇప్పుడు రూ.146 కోట్లు (2025), రూ.151 కోట్లు (2026), రూ.157 కోట్లు (2027) కు పేరగనుంది.
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా మ్యాచ్ ఫీజును ప్రవేశపెట్టారు. ప్రతి ప్లేయింగ్ సభ్యుడికి (ఇంపాక్ట్ ప్లేయర్ తో సహా) మ్యాచ్ ఫీజు రూ.7.5 లక్షలు. ఇది అతని కాంట్రాక్ట్ మొత్తానికి అదనంగా ఉంటుంది. ఏ విదేశీ ఆటగాడు అయినా బిగ్ వేలం కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విదేశీ ఆటగాడు రిజిస్టర్ చేసుకోకపోతే వచ్చే ఏడాది జరిగే ఆటగాళ్ల వేలంలో రిజిస్టర్ చేసుకోవడానికి అనర్హుడుగా ఉంటారు. ఆటగాళ్ల వేలంలో రిజిస్టర్ చేసుకుని వేలంలో ఎంపికైన తర్వాత సీజన్ ప్రారంభానికి ముందు అందుబాటులో ఉండని ఆటగాడిపై 2 సీజన్ల పాటు టోర్నమెంట్, ఆటగాళ్ల వేలంలో పాల్గొనకుండా నిషేధం విధిస్తారు.
సంబంధిత సీజన్ జరిగే సంవత్సరానికి ముందు చివరి ఐదు క్యాలెండర్ సంవత్సరాల్లో అంతర్జాతీయ క్రికెట్ (టెస్ట్ మ్యాచ్, వన్డే, ట్వంటీ 20 ఇంటర్నేషనల్) లో స్టార్టింగ్ ఎలెవన్ లో ఆడకపోతే లేదా బిసిసిఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ లేకపోతే ఒక క్యాప్డ్ భారత ఆటగాడు అన్క్యాప్డ్ అవుతాడు. ఇది భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రెగ్యులేషన్ 2025 నుంచి 2027 వరకు కొనసాగుతుంది. అన్ క్యాప్డ్ ప్లేయర్ గరిష్టంగా నాలుగు కోట్లు అందుకుంటారు.