నోరు మూసుకుని కూర్చోలేం.. కేంద్రంపై సుప్రీం ఆగ్ర‌హం

We cannot be the mute spectators say Supreme Court
We cannot be the mute spectators say Supreme Court
  • దేశం సంక్షోభంలో చిక్కుకుంది..
  • క‌రోనా క‌ట్ట‌డికి ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు?
  • టీకా ధ‌ర‌లు, క‌రోనా చికిత్స మందుల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు ఏం చేస్తున్నారు?
  • క‌రోనాపై ప్ర‌తిరోజూ విచార‌ణ జరుపుతాం
  • సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టిస్తున్న సంక్షోభం రోజురోజుకూ ముదురుతూనే ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్ర‌భుత్వంపై స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌లే దేశంలోని ప‌లు హైకోర్టులు క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ.. ఆయా ప్ర‌భుత్వాల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్య‌క్తం చేస్తూ.. ఘాటు వ్యాఖ్య‌లు చేశాయి.

దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సైతం ఇటీవ‌లే క‌రోనా నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేసింది. మ‌రీ ముఖ్యంగా క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు, ఆస్పత్ర‌ల్లో ప‌డ‌క‌ల కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త‌, వైద్య స‌దుపాయాలు అంద‌క ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులపై తీవ్రంగానే స్పందించింది.

తాజాగా ఇదివ‌ర‌కు వాయిదా వేసిన క‌రోనా నేప‌థ్యంలోని సమోటో పిటిష‌న్ ను విచారించింది. ఈ క్ర‌మంలోనే కేంద్రం ప్ర‌భుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భార‌త్ ప్ర‌స్తుతం సంక్షోభంలో చిక్కుకుంద‌నీ, ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో తాము నోరు మూసుకుని కూర్చోలేమంటూ తేల్చి చెప్పింది. క‌రోనా సంక్షోభంపై స్పందించే అధికారం ఆయా రాష్ట్రాల హైకోర్టుల‌కు ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఆయా హైకోర్టుల విచార‌ణ‌లు, చ‌ర్య‌లను తాము అనుసంధానం చేసుకుని ప్ర‌తిరోజూ విచార‌ణ జ‌రుపుతామ‌ని వెల్ల‌డించింది. న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం క‌రోనా సంక్షోభాన్ని సుమోటోగా స్వీక‌రించి విచార‌ణ జరుపుతున్న సంగ‌తి తెలిసిందే.

కాగా, గ‌త విచార‌ణ‌లో క‌రోనా సంక్షోభంపై జాతీయ ప్ర‌ణాళిక ఉందా? ఉంటే వెంట‌నే దానిని అందించండి అంటూ సుప్రీంకోర్టు పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఆ ప్రణాళికను సుప్రీంకోర్టుకు అందజేశామని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం వెల్లడించారు. దీనిపై మరో రెండు రోజుల్లో విచారణ చేపడతామని న్యాయ‌స్థానం తెలిపింది. ప్రతి రోజూ కరోనా పరిస్థితులపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది.

ఈ క్ర‌మంలోనే సుప్రీం ధ‌ర్మాస‌నం కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసింది. టీకాలు, క‌రోనా చికిత్స మందుల ధ‌ర‌ల‌పై మీరు తీసుకుంటున్న చర్యలేంటని ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించింది. ప్ర‌స్తుత సంక్షోభంలో అంద‌రికీ టీకాలు అందించ‌డం అతి ముఖ్య‌మైన అంశ‌మ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

అయితే, తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఇదివ‌ర‌కు చెప్పిన ధ‌ర‌ల‌కు, ఇప్పుడు ఆయా సంస్థ‌లు ప్ర‌క‌టిస్తున్న ధ‌ర‌ల‌కు ఎందుకు వ్య‌త్యాసం ఉంది? దీనిపై ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు? అంటూ కేంద్రంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అలాగే, త్రివిధ ద‌ళాలు, రైల్వేల‌కు చెందిన వైద్య వన‌రుల‌ను ఏమైనా వాడుకునే ఆలోచన ఉందా? దీని కోసం ఏం చ‌ర్య‌లు తీసుకుంటూన్నారో చెప్పండి అంటూ పేర్కొంది.

https://darvaaja.com/lockdown-in-telangana/
https://darvaaja.com/82-dead-in-iraq-covid-hospital-fire/

Share this content:

Related Post