“అవును వాళ్లు.. గే, హిజ్రా, పాయింట్ ఫైవ్, ఆడంగి వాళ్లే..” అయితే నీ కొచ్చే ఇబ్బంది ఏంటి ? “ అవును.. ఆడ లక్షణాలతో పుట్టిన మగవారే. వాళ్లు సగం అటు సగం ఇటుగానే ఉంటారు”. అయితే ఏం అవుతుంది? వాళ్లంటే ఎందుకంత చిన్నచూపు నీకు ? వాళ్లు మీ ఇంట్లో పుడితే.. చంపేస్తారు. లేకపోతే.. తరిమేస్తారు కదా ? వాళ్ల బతుకులు వాళ్లు ఎలగోలా బతుకుతున్నారు కదా.. అలా కూడా బతకనివ్వరా ?
అమ్మాయిల మీద దాడులు జరిగితే.. రక్షించేందుకు చట్టాలు ఉన్నాయి. మగవారికి ఏమైనా జరిగితే.. చూసుకునేందు వారి కుటుంబం ఉంది. మరీ పుట్టకతో వచ్చిన లక్షణాల వల్ల మాట, నడక కొద్దిగా అమ్మాయిలలా ఉండే.. హిజ్రా మీద లైంగిక దాడులు జరిగితే..? ఎవరు పట్టించుకుంటారు? “ఇలా మాట్లాడుతున్నావ్”, “ఇలా నడుస్తున్నావ్” అని ఇంట్లో నుంచి తల్లిదండ్రులు తరిమేస్తే. మా మీద వివక్ష జరుగుతుందని పోలీసులకు చెప్పేందుకు పోయినా కానీ అక్కడ కూడా మరింత వివక్ష ఎదురైతే వాళ్లను ఆదుకునే నాధుడు ఎవరు ?
మీరు గొప్పగా కొలిచే శివుడు అర్ధనారీశ్వరుడే కదా! అర్ధనారీశ్వరుడు అంటే అర్థం ఏంటి! ఆయన ఒక్కరే కాదు ఎంతో మంది దేవుళ్లు కూడా ఇలా ఉన్నారు కదా! వాళ్లే కాదు ప్రపంచంలో ఉండే ఎన్నో లక్షల జీవ రాశులు కూడా పాయింట్ ఫైవ్ అని మీకు తెలుసా ? అవునులే.. మీకు ఎందుకు తెలుస్తాయి. మీరు చదువుకున్న అజ్ఙానులైతిరి. నోరు పారేసుకోవడమే కానీ.. కనీసం ఒక విషయంపై అవగాహన ఉండదాయే..

అయితే మీరు ఎంతో చిన్న చూపు చూసే ఈ ‘గే’ ల ఆవేదనను ఒక్కసారి అర్థం చేసుకుంటే.. కళ్లల్లోకెళ్లి నీళ్లు రావడం కాయం. వాళ్లు పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచంతో యుద్ధం చేస్తునే ఉంటారు. వాళ్లకు బాసటగా నిలిచే వ్యక్తులు ఒక్కరు కూడా ఈ సమాజంలో లేకపోవడం దురదుష్టకరం. వాళ్లు మీలా ఉండటం రాక, వాళ్లకు నచ్చినట్లు ఉండలేక ప్రతీ క్షణం నరకాన్ని అనుభవిస్తునే ఉంటారు.
ఇక వీళ్ల గురించి మీకు తెలియని పలు విషయాలు
హిజ్రా అనేది ఉర్దు పదం. ఈ హిజ్రాలను అరవాణి, ఆరువాని, జంగప్ప, నపుంసకులు అని పిలుస్తారు. పేరు ఏదైనా కానీ వీళ్లు అందరికన్న కింది స్థాయివాళ్లు అనేది మాత్రం నిజం. వీరి గురించి పవిత్ర గ్రంథాలు అయిన భగవద్గీత, ఖురాన్ లలో కూడా ప్రస్తావించారు. అలాగే అర్థనారీశ్వరుడైన శివున్ని ప్రతీ ఇంట్లో కొలుస్తారు. కానీ అదే అర్ధ నారీశ్వరుడు ఇంట్లో పుడితే మాత్రం.. వాన్ని చీదరించుకుంటారు ఎందుకని? దీంతో మీ పరువు మర్యాదలకు భంగం వాటిళ్లుతుందా ? అలాంటి పరువు, మర్యాదలను గంగలో కలపండి. అప్పుడే మీరు మనుషులవుతారు. లేకపోతే మీరు మనుషులు కారు.
ఎంతో మంది హిజ్రాలు తమ కడుపును నింపుకోవడానికి భిక్షటన లేకపోతే పడుపు వృత్తిని ఎంచుకుంటున్నారు. వారి బాగోగులు చూసుకునే హిజ్రాను దాది, అత్తమ్మగా పిలుస్తారు. హిజ్రాలకు కష్టపడే గుణం ఉంటది. కానీ ఫైసలు ఇవ్వాల్సిందే అని దౌర్జన్యం చేస్తారని వారిపై ఆరోపణలు మోపుతారు. ఇందులో నిజం లేదు. అలా చేసేది ఫైసలకోసం ఆశపడే మగవారే చీర కట్టుకుని ఇలాంటి దౌర్జన్యాలకు దిగజారుతారు.

వాళ్లు “మా మీద అత్యాచారం జరిగింది” అని అంటే.. ఎంతమంది పోలీసులు స్పందిస్తారు? “మీ మీద కూడా అత్యాచారాలు జరుగుతాయా” అని నవ్వే.. పోలీసులు ఈ రోజుల్లో లేనే లేరంటారా? ఇంత జరిగినా తమ బాధలను ఎక్కడ కూడా గట్టిగా వినిపించలేని ఆవేదన వాళ్లది. ఎందుకంటే వాళ్లకంటూ ఒక ప్రత్యేక చట్టాలు లేకపోవడమే కారణం.
బహుశా జనానికి, ప్రభుత్వానికి హిజ్రాలకు వ్యభిచారం చేసేంత ఆడతనం ఉందని అనిపించొచ్చు. దాంతో పాటు అత్యాచారానికి గురైతే వాళ్లు పడే బాధ కూడా అర్థం అయి ఉండాలి కదా ? ఇలా అర్థం కాకపోవడం హిజ్రాల దౌర్భాగ్యం అనాలేమో! అవును హిజ్రాలు స్త్రీల కన్న చాలా సున్నితం. ఎందుకంటే స్త్రీగా మారలన్న కోరికతో లింగ మార్పిడి చేయించుకుంటారు. ఆ చికిత్స తరువారు 40 రోజుల పాటు మంచం మీద నుంచి లేవొద్దు. అది నరకంతో కూడిన పని.
అలాగే ఈ శస్త్ర చికిత్స కంటే ముందు, ఆ తర్వాత hormonal imbalance therapy చేయించుకుంటారు. ఇది నరకంతో పాటు బాగా ఖర్చుతో కూడుకున్నది. అయినా వీటిని అన్నింటిని భరిస్తున్నారు. అలాంటి వారిపట్ల ప్రేమ లేకున్నా.. సగటు మనిషిపై ఉండే గౌరవం అయినా ఉండాలి. అప్పుడే వాళ్లు కూడా సంతోషంగా ఉంటారు.

ఈ హిజ్రాలు కేవలం భిక్షటనకే పరిమితం కాలేదు. పెద్దపెద్ద కొలువులు చేసే వాళ్లు కూడా ఉన్నారు. వారి గురించి మీకు తెలుసా..?
షబ్నమ్ బానో: మధ్య ప్రదేశ్ లో మంత్రిగా 1998 నుంచి 2003 వరకు తన సేవలను అందించారు.
లక్ష్మి నారయణ్ త్రిపాఠి: ఈమె బొంబాయికి చెందిన ఆవిడ. భరత నాట్యంలో మంచి ప్రావిణ్యం ఉన్న వ్యక్తి. బాలీవుడ్ యాక్టర్లకు ఎంతో మందికి భరత నాట్యాన్ని నేర్పించారు. ఈవిడ హిజ్రాల గురించి ఒక పుస్తకాలు కూడా రాశారు. ఆ పుస్తకాల పేర్లు.. “మీ హిజ్రా”, “మీ లక్ష్మి”.
ప్రితికా యాషిని: దేశంలో మొదటి ట్రాన్స్ జెండర్ పోలీస్ ఆఫీసర్.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కష్టాలకు ఓర్చుకుని విజయం సాధించిన వారు ఉన్నారు. కానీ ఈ విజయం వెనుక కూడా కొందరు మంచి మనుషుల సహకారం ఉంది. అలాంటి మంచి మనుషులం మనం కూడా అయితే.. మన చుట్టూ ఉండే హిజ్రాలు కూడా గొప్ప స్థాయికి చేరుకుంటారు. అలా మనం ఉండటం లేదు కనుకే.. గొప్ప గొప్ప చదువులు చదివి కూడా భిక్షటనకే ఎంతో మంది హిజ్రాలు పరిమితం అవుతున్నారు.
అలాగే ఏదైనా ఉద్యోగం చేద్దామనుకునే హిజ్రాలను చేరదీసి ఉద్యోగం ఇచ్చే నాధులు ఎంత మంది? పట్టుమని 3 నెలలు కూడా వాళ్లను జాబ్ లో ఉంచుకోరు అంటే వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోండి. అర కొర ఉద్యోగాలు వచ్చినా అక్కడ కూడా వివక్షే ఉంటుంది. కానీసం వాళ్లకు ప్రత్యేక టాయిలెట్లు లేక ఎటు పోవాలే తెలియదు.

ప్రతీ పది మంది హిజ్రాల్లో తొమ్మిది మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. అది కూడా ఒకసారి కాదు మళ్లీ మళ్లీ జరుగుతునే ఉన్నాయి. దీనిపై మాట్లాడే వాళ్లు ఉన్నారా ఇప్పుడు? దీన్ని అర్థం చేసుకునే వ్యక్తులు ఎక్కడున్నారు ? ఏ పాలక వర్గం దీనిపై దృష్టి పెట్టింది.
ఈ టాయిలెట్ల సమస్య ప్రతీ హిజ్రాను వేదిస్తుంది. ఈ సమస్యతో వాళ్లు నీళ్లు కూడా సరిగ్గా తాగరు. దాంతో మూత్ర పిండాల వ్యాధుల బారిన వీరు ఎక్కువగా పడుతుంటారు. ఈ సమస్యను తీర్చేందుకు nalsa judgement ఉపయోగపడుతుంది. ఇందులో ఆడ, మగ కు ఎలాగైతే టాయిలెట్లు ఉంటాయో.. అలాగే ట్రాన్స్ జెండర్ కు కూడా టాయిలెట్లు ఉండాలని చెబుతుంది.
ఈ జడ్జిమెంట్ ను కేవలం నాగాపూర్ మాత్రమే గౌరవించింది. మిగతా స్టేట్లు గాలికి వదిలేశాయి. ఈ హిజ్రాలో 65 ఏళ్లకు మించి బ్రతికిన వారు చాలా తక్కువని చాలా సర్వేలు చెబుతున్నాయి. అంటే అర్థం చేసుకోవాలి. దీన్ని పాలకులు ఎందుకు సీరియస్ గా తీసుకుంటలేరో అర్థం అవుతలేదు.
జీవించే హక్కు పుట్టిన ప్రతీ ఒక్కరికి ఉంది కదా? మరీ మనం వారిపట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నాం.. మనకు వివేకం లేకపోవడమా లేక బుద్ధి హీనులం అవ్వడమా? ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబంలో హిజ్రా పుడితే.. వాళ్లను వాళ్లకు నచ్చినట్లు బతకనివ్వండి. మంచి చదువు చెప్పించండి. కానీ ఇలా మాట్లాడకు.. ఇలా నడవకు.. ఇలా ఆడంగి పనులు చేయకు.. అని మాత్రం అనొద్దు.

పనుల్లో ఆడ, మగ ఏంటి ? మనం ఏ కాలంలో బతుకుతున్నాం. మన కంటే జంతువులు నయ్యం. తన జాతి పట్ల వివక్ష చూపించవు. కానీ మనం అలా కాదు కదా! అందుకే హిజ్రాలపట్ల గౌరవంగా ఉండాలి. ఇంట్లో, బయట స్వేచ్చ ఉండాలి. చట్టాల్లో వారికి రక్షణ కల్పించాలి. ఉద్యోగవకాశాలను పెంచాలి. అనాథలుగా ఉన్నవారిని ప్రభుత్వం చేరదీయాలి.
స్త్రీల విషయంలో అత్యాచారం జరిగితే.. ఎలాంటి చట్టాలు ఉన్నాయో.. అలాగే హిజ్రాలకు కూడా ప్రొటెక్షన్ కల్పించాలి. ముఖ్యంగా ముందు మన ఆలోచన ధోరణి మారాలి. వాళ్లు మనలో ఒకరిగా గుర్తించాలి. అప్పుడే వాళ్లు మనతో పాటుగా జీవించగలుగుతారు. లేకపోతే.. వారి మనుగడ కష్టం అవుతుంది. హిజ్రాగా పుట్టడం వారు చేసిన తప్పు కాదు. వాళ్లను హింస పెట్టడం మాత్రం మన తప్పే.. అది కూడా క్షమించరాని తప్పు. ఇప్పటికైనా ఆలోచిస్తారని నమ్ముతూ..

విద్య శ్రీనివాస్
లా స్టూడెంట్,
హైదరాబాద్,
vidyamandali92@gmail.com.
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
టీవీ, మొబైల్స్.. డెంజర్‌లో టీనేజర్స్ !