దర్వాజ – హైదరాబాద్
హైలెట్స్
- పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా విజయం
- ఆండ్రీ రస్సెల్ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో 36 పరుగులు చేశాడు
- జోష్ ఇంగ్లిస్ (78), కామెరూన్ గ్రీన్ (56) అజేయ భాగస్వామ్యం
- వెస్టిండీస్ ఫీల్డింగ్‌లో 6 క్యాచ్‌లు వదిలి మ్యాచ్ కోల్పోయింది
Australia vs West Indies: పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో మంగళవారం జరిగిన రెండో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆండ్రీ రస్సెల్‌కు ఇది చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. అయితే, అతని వీడ్కోలు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దుమ్ము రేపే ప్రదర్శన ఇచ్చింది.
ఆండ్రీ రస్సెల్ పవర్ షో
ఆండ్రే రస్సెల్ తన చివరి మ్యాచ్‌ను గుర్తుండిపోయేలా చేసేందుకు యత్నించాడు. కేవలం 15 బంతుల్లో 36 పరుగులు చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (51) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడగా, వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 172/8 స్కోరు చేసింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఆండ్రీ రస్సెల్ మాట్లాడుతూ, “నా సొంత గడ్డపై, కుటుంబం, స్నేహితుల ఎదుట నా కెరీర్ కు వీడ్కోలు పలకడం గర్వంగా ఉంది. ఫలితం అనుకూలించకపోయినా, నేను సంతృప్తిగా ఉన్నాను” అని పేర్కొన్నాడు.
వెస్టిండీస్ తప్పిదాలలో ఓటమి
ఫీల్డింగ్‌లో వెస్టిండీస్ జట్టు ఘోరంగా విఫలమైంది. మొత్తం 6 క్యాచ్‌లు వదిలింది. వీటిలో రెండు క్యాచ్‌లు జోష్ ఇంగ్లిస్, కామెరూన్ గ్రీన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ లను అందుకోలేకపోయారు. ఈ ఫీల్డింగ్ తప్పిదాలు జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి.
జోస్ ఇంగ్లిస్-గ్రీన్ బలమైన ఆరంభం
ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యంతో ఛేజ్‌ను ప్రారంభించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (12), మిచెల్ మార్ష్ (21) త్వరగానే ఔట్ అయ్యారు. స్కోరు 41/2 వద్ద ఆ జట్టు తడబడినట్టు అనిపించినా, ఇంగ్లిస్, గ్రీన్ ఆసీస్ ను నిలబడ్డారు. ఇద్దరూ కలిసి అజేయంగా 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లిస్ 33 బంతుల్లో 78 పరుగులు, గ్రీన్ 56 పరుగులు (4 సిక్సర్లు) చేసి విజయాన్ని ఖాయం చేశారు. ఆటను 15.2 ఓవర్లలోనే ముగించారు.
జోస్ ఇంగ్లీస్ ధనాధన్ ఇన్నింగ్స్
ఈ మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడిన జోస్ ఇంగ్లీస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. “బౌన్సర్లకు ఎదురుగా ఆడటం కష్టం కాదు. స్పిన్‌తో జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. అందుకే పేసర్లపై ఎదురు దాడికి దిగాం” అని ఇంగ్లిస్ అన్నాడు.
ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను 3-0తో గెలుచుకున్న ఆస్ట్రేలియా, టీ20 సిరీస్‌ను కూడా గెలవడానికి ఒక అడుగు దూరంలో ఉంది. శనివారం బాసెటెర్లో జరగనున్న మూడో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
