దర్వాజ – హైదరాబాద్
ఇంగ్లాండ్‌లోని ఓవల్ లో జరుగుతున్న భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ 2025 చివరి మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. నాల్గవ రోజు చివరలో వర్షం, గాలి కారణంగా ఆట ఆగిపోవడం భారత జట్టుకు కలిసొచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. విజయం కోసం వారికి కేవలం 35 పరుగులే కావాలి. అయితే భారత బౌలింగ్ దళానికి కూడా ఇదే మంచి అవకాశం. చివరి రోజు కేవలం 3 వికెట్లు పడగొట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా కీలకమైన ఒక్క వికెట్ తీస్తే చాలు మ్యాచ్ భారత్ వైపు వస్తుంది.
క్రిస్ వోక్స్ గాయం భారత్‌కు కలిసొచ్చేనా?
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ గాయంతో బ్యాటింగ్‌కు రావడం లేదు. నాల్గవ రోజున స్టంప్స్ అనంతరం అతడు చేతికి ప్యాడ్‌లు ధరించి కనిపించడం గమనార్హం. మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ సమయంలో అతనికి గాయం జరిగింది. దీంతో భారత్‌కు 10 వికెట్లు కాకుండా కేవలం 9 వికెట్లే అవసరం అవుతుంది. అప్పటికే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌కు ఇప్పుడు సమర్థవంతమైన బ్యాట్స్‌మెన్ జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్ మాత్రమే మిగిలారు.
టీమిండియాకు ప్రధాన వికెట్ జేమీ స్మిత్
ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్‌ను గెలిపించే స్థాయిలో ఉన్న బ్యాట్స్‌మన్ జేమీ స్మిత్. గత ఇన్నింగ్స్‌ల్లో అతను 40, 44, 184, 88, 51 వంటి కీలక స్కోర్లు చేశాడు. అతని బ్యాటింగ్ శైలికి భారత బౌలర్లు ఇబ్బంది పడ్డారు. అయితే, అతనికి ముచ్చటగా రెండు సార్లు అవుట్ చేసిన భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ప్రదర్శనపై ఇప్పుడు టీమిండియా ఆశలు పెంచుకుంది.
ప్రసిద్ధ్ కృష్ణ vs జేమీ స్మిత్
సిరీస్‌లో ఇప్పటివరకు ప్రసిద్ధ్ కృష్ణ 7 వికెట్లు తీసి భారత్‌కు కీలక విజయాలు అందించారు. జేమీ స్మిత్‌ను మొదటి టెస్ట్‌లో ముఖ్యమైన సమయంలో అవుట్ చేశారు. అలాగే, ఐదవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 8 పరుగులకే అతన్ని పెవిలియన్‌కు పంపించారు. కృష్ణ బౌలింగ్‌లో అతను ఎక్కువగా ఇబ్బంది పడతాడు. స్మిత్ బలవంతంగా డిఫెన్సివ్ గేమ్ ఆడడం గమనార్హం.
ఓవల్ లో చివరి రోజు ఏం జరగనుంది?
ఇంగ్లాండ్‌కు 35 పరుగులు కావాలి కానీ భారత్‌కి కావలసింది కేవలం జేమీ స్మిత్ వికెట్. ఒకవేళ ప్రసిద్ధ్ కృష్ణ అతన్ని అవుట్ చేస్తే జేమీ ఓవర్టన్ ఒక్కడిగా ఏమీ చేయలేడు. మరోవైపు వోక్స్ క్రీజ్‌కు రాలేదు కాబట్టి ఇక భారత్ విజయానికి మార్గం సులువు అవుతుంది. ఆటలో వర్షం మళ్లీ అంతరాయం కలిగించకపోతే, 5వ రోజు ప్రారంభంలోనే మ్యాచ్ ఫలితం తేలిపోవచ్చు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ వైపు ఉన్న మరో వికెట్ పడితే భారత్ వైపు మ్యాచ్ మారే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలుపుతో సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో భారత్ బరిలో దిగింది.
